Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ హీరో, డైరెక్టర్, హీరోయిన్ అరెస్ట్ తప్పదు: సిట్ వర్గాలు

డ్రగ్స్ దందాలో కూరుకుపోయి, డీలర్లకు, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేశారని సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో, ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్ ల అరెస్ట్ తప్పదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో వీరు ముగ్గురి చుట్టూనే ఉచ్చు బిగిస్తోంది. మిగతా వారంతా కేవలం కస్టమర్లుగా మాత్రమే ఉన్నారని, వీరు మాత్రం ఎంతో మందికి తమ చేతుల మీదుగా డ్రగ్స్ సరఫరా చేశారని సిట్ వర్గాలు గుర్తించాయి.

డ్రగ్స్ కు అలవాటుపడి కస్టమర్లుగా ఉన్న వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తున్న పోలీసులు, మరొకరికి మత్తుమందులు సరఫరా చేసిన వారిని మాత్రం వదిలేది లేదని చెబుతున్నాయి. కస్టమర్లుగా ఉన్న వారిని ప్రశ్నించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పించి, ఈ దందాకు, మత్తుమందుల వాడకానికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తామని చెబుతున్న అధికార వర్గాలు, ఈ ముగ్గురినీ మాత్రం అరెస్ట్ చేయక తప్పదని అంటున్నాయి. రెండు మూడు రోజుల్లో వీరి ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభిస్తాయని, ఆపైనే వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

దీంతో నోటీసులు అందుకున్న వారిలో ఈ ముగ్గురూ ఎవరన్న విషయమై అందరిలో ఆందోళన నెలకొంది. ఇక ఓ పబ్బులో వాటా ఉండి, డీలర్లకు, కస్టమర్లకు వారధిగా ఉన్నాడని భావిస్తున్న మరో మాజీ హీరో చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది. సదరు హీరో గతంలోనూ పోలీసు కేసులు ఎదుర్కొన్నాడని సమాచారం. ఇక నగరంలోని అన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్లు, వాటి మేనేజర్లు, కీలక ఉద్యోగులను కూడా ఓ సారి విచారించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

More Telugu News